Tuesday , 24 December 2024

Home » Culture » linguistic analysis on Telangana dialect

linguistic analysis on Telangana dialect

It is written by a unknown linguist.But,it is a marvel about the Telangana dialect.It is a fitting answer , who ridicule this dialect. enjoy the reading.
తెలంగాణా భాష కాదు అనేవాళ్ళు ఇది చదవండి….

తెలంగాణ ప్రజలు ఎంతో అర్దవంతమైన భాష మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మేర అన్న పదాన్ని పరిశీలించండి. ఈ పదాన్ని ఇతర ప్రాంతీయులు “దర్జీ” అంటున్నారు. అది ఉర్దూ పదం.

మేరల (హద్దులు) మేరకు గుడ్డల్ని కత్తిరించి కుట్టే వ్యక్తి మేర. ఇదేమో తెలుగు పదం. తెలంగాణలో వ్యవహరించబడే కాపోల్లు, కాపుదనపోల్లు అనే మాటలు అసలు సిసలు తెలుగు పదాలు.

పంట పండించి కాపు (కాపలా)గా వుండేవాళ్ళు కాపోల్లు. దీనికి సమానార్థకంగా ఆంధ్రప్రాంతంలో రైతులు అంటున్నారు. రైతు ఉర్దూ పదం.

మెత్తగా వుండునట్లు తలకింద పెట్టుకునేది ‘మెత్త’ (దిండు), రోట్లో వేసి నూరినప్పుడు, తొక్కితే ఎట్లా మెత్తనవుతుందో అట్లా తయారైనది ‘తొక్కు’ (పచ్చడి), తన్నితే, తంతే పడివుండేది

‘తంతె’ (మెట్టు), చల్లగా వుండేది ‘చల్ల’ (మజ్జిగ), ఎర్రగా వుండేది ‘ఎర్ర’ (వానపాము), వర్షకాలంలో నీటి ప్రవాహంతో ఒర్రేది (అరిచేది) కాబట్టి ‘ఒర్రె’, వాగునది, వాగేది కనుక ‘వాగు’,

నదించేది, శబ్దించేది కనుక ‘నది’. ఇవన్నీ నిఖార్సైన నికాలస్ తెలుగు పదాలు. అంగాన్ని లేదా శరీరాన్ని కప్పి వుంచేది ‘అంగీ’ (చొక్కా), లాగుతూనే వేసుకుని లాగుతూనే తీసి పారేస్తాము

కనుక ‘లాగు’ (పంట్లాము), గుల్లగా అంటే ఖాలీగా వుండేది ‘గుల్ల’ (గంప). లోన బోలుగా వుంటాయి కనుక ‘బోలు ప్యాలాలు’ (మరమరాలు), జిహ్వకు రుచికలిగించేవి ‘జిమ్మలు’

(చేపలు), తినేటపుడు కంచంలో ఒక అంచుకు, పక్కన పెట్టుకున్నందువల్ల మాట్లాడే ‘అంచుకు పెట్టుకునుడు’ (నంజుకునుడు), సున్నపురాయి, కోడిగుడ్లు, జిగురు మొదలైనవి కలిపి

బాగా ‘దంగు’నట్లు ప్రత్యేకంగా తయారు చేయబడిన పాతకాలంనాటి ‘డంగ్ సున్నం’, కంకుతూ తింటాము కనుక ‘కంకి’ (పొత్తు), చిట్టిగా, చిన్నగా వుండే ‘జిట్టపులి’ (చిరుతపులి),

గోళాకారంలో వుండే ‘గోలి’ (మాత్ర), తడి కల్గిన భూమి ‘తరి’ (మాగాణి), శుష్కమైన ఎండ నేల కుష్కి (మెట్ట), గిరుక్కున తిరిగే ‘గిరక’ (గిలక), గిరకమీంచి తాడు జారి సందులో పడగా

వ్యవహరించే ‘సందెన వడుడు’, గుడి ఆవరణలో గుండ్రంగా వుండేది ‘గుండం’ (పుష్కరిణి), కళ్ళు బైర్లు కమ్ముతూ మన కళ్ల ముందు చక్రం తిరిగినట్లు తిరిగే ‘చెక్కరచ్చుడు’ (తల

తిరగడం), ఉన్నట్టుండి వెఱగుపడే ‘బీరిపోవుడు’ (ఆశ్చర్యపోవడం), గుండ్రంగా వుండే ‘గుండీ’ (బొత్తాం), దెబ్బలు, గాయాలు మొ|| వాటితో గజ్జలో దిగిన వాపుతో గగ్గోలు పడే ‘గగ్గోడు’,

ఆకాశమ్మీది నుండి వెళ్ళే ‘మీది మోటర్’, స్టార్టు చేయగానే కుట్ కుట్ అని చప్పుడు చేసే ‘కుట్కుటు మోటరు’… ఇవి సరళమైన, అర్థవంతమైన, నిరాడంబరమైన సాఫ్‌సీదా తెలుగు పదాలు.

ఇంకా చూడండి:

కారడ్డం మాటలు = (వెటకారమ్మాటలు) నిజానికివి కాలడ్డం మాటలు. కాలు అడ్డు పెట్టబడిన మాటలు. ఈ కాలు + అడ్డే మాటలే కాలొడ్డే మాటలయ్యాయి ఉదా|| (సిరి రా

మోకాలొడ్డినట్లు…)
కాపాయం: పొదుపు; కాపు+ఆయం = కాపాయం. ఆయం అంటే ఆదాయం. (ఆయ వ్యయాల్లో ఆయం వుంది కదా!) ఈ ఆయాన్ని కాపు చేసుకోవడం అంటే కాపాడుకుని పొదుపు

చేయడమే కాపాయం.
కమ్మగ కాయి పాయి చేసుకుని తినుడు = ఇష్టమృష్టాన్నాల్లాగా అన్నపానాదులు ఆరగించడం. కాయి (ఖాద్యం) = అన్నం, ఆహారం; పాయి = (పేయం) పానీయం.
అన్నం కచ్చె పెక్క ఉడుకుడు = అన్నం ఉడికీ ఉడక్కపోవడం కచ్చా అంటే పచ్చి. ఉడకనప్పుడు కచ్చాగానే వుంటుంది. పెక్క (పక్క, పక్కా) అంటే పక్వం. ఉడికినప్పుడు పక్వమై పక్క,

పెక్కగా మారుతుంది.
తడలు గొట్టుడు = ఉప్పొంగడం, తటాకాదుల్లోని అలలు గాలితో కడల్కొనడం.
మన్ను దుల్లు దుల్లు అవుడు = బాగా దున్నినందువల్ల నేల ‘వదులొదులు’ కావడం.
కుల్లుల్లు చేసుడు = చక్కగా తేరుకుని తేటగా వున్న ఏటి నీటిని కుదిపి కదిపి అడుగున వున్న మట్టీ బురదలకు చెందిన కుళ్ళూ, మకిలలతో మురికి చేయడం.
పూస పేర్లోల్లు = పూసలు, పేరులు (దండలు), అద్దాలు, దువ్వెండ్లు మొ||నవి అమ్ముకునే వాళ్ళు.
పేర్నాల వెట్టుడు = పేరులు, నామాలు పెట్టి నిందించడం
మాట తొందురుతొందురు పోవుడు = తొందర తొందరగా మాట్లాడితే వచ్చినట్లు పక్షవాతాదుల వల్ల మాటలు తడబడడం.
బూమి దామార నానుడు = వర్షాదుల వల్ల భూమితన దాహం ఆరేలా తడిసిపోవడం.
ఏ భాషకైనా జవజీవాలు జాతీయాలూ, సామెతలే! తెలంగాణ వాసుల పలుకులో నుడికారం వుంటుంది. జానపదత్వం తొంగి చూస్తూ వుంటుంది. మట్టివాసన గుబాళిస్తూ ఉంటుంది. వీళ్లకు

ఏది కొందామన్నా “అగ్గిల చెయి పెట్టినట్లుం”టుంది. తమకు యిష్టం కాని వాళ్ళను చూసినప్పుడు “పెయ్యి పొంట ముండ్లు” వస్తయి. “కాల్లు కడుపులు పట్టుకుని” బతిమాలి బామాలే

సందర్భాలు వీళ్ళక్కూడా ఉంటాయి. వీళ్ళు తమ బతుకుల్ని దాదాపు “గుడ్డి కొంగలోలె” ఎల్లదీస్తూ వుంటారు. అయిష్టమైన పనులు చేస్తున్నప్పుడు “ముండ్ల మీదున్నట్లు” భావిస్తారు.

కరువులు, కాటకాల వల్ల యిక్కడి బతుకులు “మంటలు పడ్డట్లు” అవుతాయి. అయితే… తెలంగాణలో కూడా “కాని తూట్ల కెల్లి కర్రెపిట్టను ఈగిం”చగలిగిన అఘటన ఘటనా

దురంధరులున్నారు. “వంగితె పిచ్చలు మాయం చేసెటోల్లు” కూడా వున్నారు. వెనకబాటు తనం వల్ల తెలంగాణ వాసుల బతుకు “పల్లేరు కాయలల్ల బొర్లిచ్చినట్లు” ఉంటుంది. వీళ్ళు

మనస్పూర్తిగా కాక “కడుపునిండ” మాట్లాడుకుంటారు. (ఆ మనస్సు ఎక్కడుందో తెలియని అమాయకులు కదా!) వాన కాలంలో ఎప్పుడు “మొగులు మెత్తవడు”తుందా అని ఎదురుచూస్తూ

వుంటారు. “దొంగ చీకటి ఒక్కటయినట్లు” (పులి మీద పుట్రలా) ఉన్న పరిస్థితుల పట్ల కలత చెందుతారు. అన్యాయంగా “బట్టగాల్చి మీద పారేస్తే” (నీలాపనిందల పాలు చేస్తే) కంట తడి

పెడతారు. “పానం కొలికిలకు వచ్చినా” (తలప్రాణం తోకకు వచ్చినా) పని చేయాలనుకుంటారు. “గుట్కిల్లు మింగరు” (నీళ్ళు నమలరు). “గట్టుకు కుక్క మొరిగినట్లు”

(అరణ్యరోదనంలా) బతుకు ఆగమైపోయినా వణ్కరు జెన్కరు. తెలంగాణలో సైతం కొన్ని “ముడ్డి లేని ముంతలుం”టయి (వ్యక్తిత్వం లేనివాళ్ళు). “ఎన్నపెడితే నాకని, ఏలు పెడితే చీకని”

కొరకరాని కొయ్యలుంటయి. “తల్లి కడుపుల పొద్దు పడుతుండంగ” అలసి సొలసిన దేహాలతో యిళ్ళకు తిరిగొస్తారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పోలికలన్నింటినీ పుణికి పుచ్చుకున్నప్పుడు ఈ

పొరగాండ్లు వాళ్ల “నోట్లకెల్లి ఊశిపడ్డట్లు” ఉన్నారంటారు. “నోట్లో బంగారు చెంచాతో పుట్టాడు” అనడానికి బదులు “బొడ్లె వరాలు పోసుకుని పుట్టిండు” అంటున్నారు. మోసం చేయడంలోగాని,

మొత్తానికి మొత్తంగా ప్రవర్తనలోగాని ఒకరికి మరొకరితో సారూప్యం ఉన్న సందర్భంలో “వీడు వాని జుట్లకెల్లి ఎల్లిండు” అంటున్నారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు బొచ్చెడు ఉదాహరణలు

చూపవచ్చు. ఇంత సొగసుతో వున్న భాషని సినిమాలో గూండాలు మొ||న పాత్రలకు పెట్టి సొమ్ము చేసుకుంటూ పరిహసించడం తెలుగు సాహిత్యంలో పెద్ద విషాదం.

తెలుగు ద్రావిడ భాషల్లో ఒకటి. తెలంగాణ తెలుగు ద్రావిడానికి చాలా దగ్గర. అయిపోవడం, నిండుకోవడం అనే అర్థంలో తెలంగాణలో “ఒడిశిపోవుడు” అన్న మాట వుంది. మలయాళంలో

“ఒడువిల” అంటే చివరికి, ఆఖరుకు అని అర్థం. ఒడిశిపోవుడు అంటే చివరికొచ్చి అయిపోవడమే మరి. తెలుగు పిల్లనగ్రోవిని తమిళంలో పుళ్ళాంగుళల్ అంటున్నారు. తెలంగాణలో దీన్నే

పుల్లంగొయ్య (కొన్ని ప్రాంతాల్లో పిల్లంగొయ్య) గా వ్యవహరిస్తున్నారు. తమిళ పుల్లాంగుళల్ కు తెలంగాణ పుల్లంగొయ్య దగ్గరగా వున్నది. తద్ధార్మార్థక భావార్థం తెలంగాణలో చేసుడు,

చూసుడు, వచ్చుడు మొ|| మాటలతో పేర్కొంటున్నాం. అయితే యితర ద్రావిడ భాషల్లో ఈ త. భావార్థం ఎలా వుందో చూడండి. చెయ్‌వుదు (చేసుడు), పార్‌ప్పదు (చూసుడు),

వరువుదు (రావడం)… ఇలా… ఇవి తమిళంలోనివి. ఇక కన్నడంలో యివే మాడువుదు, నోడువుదు, బరువుదు మొ|| ఈ రీతిలో వ్యవహృతాలు. తమిళ, కన్నడాలు రెండింటిలోనూ

ఉన్న పదాంత ‘దు’ వర్ణం తెలంగాణ ‘డు’ వర్ణం ఒక్కటే! మలయాళంలో వీటినే చెయ్యుక, నోక్కుక, వరుక అంటున్నారు. నల్లగొండలో వ్యవహరించే చేస్కం, చూస్కం, వచ్చుకం లాంటి ‘కం’

అంతాలకు మలయాళం దగ్గరగా లేదూ! తెలంగాణలో పొలానికి ఆఖరు తడి పెడుతున్నప్పుడు “తన్నీరు కట్టుడు” అంటారు. ఈ తన్నీరు తమిళ తన్నీర్ ఒకటే! వచ్చిన చుట్టాల బాగోగులు

బాగా తెలుసుకోవడం, కనుక్కోవడం, వాళ్ళను గౌరవించడం అనే అర్థంలో అర్సుకునుడు అంటున్నాం. ఇది మలయాళంలో “అఱయుక” కు సమీపం. పురుగూ పుట్రా అనే పదానికి

తెలంగాణలో పురుగుబూచి వ్యవహారంలో వుంది. ఈ “బూచి” “పూచ్చి” లోంచి వచ్చింది. పూచ్చి అంటే పురుగు (తమిళం). “తీసుకుని వెళ్ళు” అనే మాటలకు బదులుగా తెలంగాణలో

కొంటవో (కొంట పో) అంటున్నారు. ఇది తమిళంలోని “కొండు పో” కు దగ్గర. “కొండు” అంటే కొని, (గై)కొని, (తీసు)కొని అని అర్థం. పో అంటే పొమ్మని చెప్పడం. అడకత్తెర అన్న

మాటను తీసుకోండి. మలయాళంలో అడయ్‌క్క అంటే వక్క. (పోకలకు సంబంధించినది) దాన్ని కత్తిరించే సాధనం అడకత్తెర.

తెలంగాణలో లయబద్ధమైన భాష వున్నది. నాదాత్మకమైన మాట వున్నది. మాట మాట్లాడితే చాలు ఏదో ఒక సంగీతం జాలువారుతున్నది. మాట్లాడ్డమే కాదు తిట్టినా వీళ్లకు నాదమే ఆత్మ.

అందుకే “తల్లాలిని తిట్టినా తాళం తప్పొద్దురా” అన్న సామెత పుట్టుకొచ్చింది. “కోతి అయినా కొమ్మ తప్పి దుంకదు” అన్న రహస్యం వీళ్లకు బాగా తెలుసు. పాట ఎంత ముఖ్యమో తెలంగాణ

వాసులకి మాట కూడా అంతే ముఖ్యం. లయబద్ధంగా మాట్లాడుకునే మాట తీరే తెలంగాణ పాటకు ఎక్కడలేని బలాన్ని యిచ్చింది. తెలంగాణ మాట ఎంత నాదమయమో చూద్దాం.

తెట్టన తెల్లారుడు, పట్టన గుండె వల్గుడు, బెక్కన బెంగటిల్లుడు, చెటాన చెంపదెబ్బ ఏసుడు, పిటాన పిరం, మూట ముగ్గురు… యిలాంటివి ఎన్నింటినో చూపవచ్చు. మధ్య మాండలికంలో

“తెట్టన తెల్లారుడు” కు బదులు భళ్ళున తెల్లవారడం వుంది. “తెట్టన తెల్లారుడు” లోని యతిమైత్రికీ, “భళ్ళున తెల్లవారడం” లోని ప్రాసయతికీ తేడా లేదూ!

తెలంగాణలో వ్యవహరించబడే అతులం కుతులం, కల్గం పుల్గం, తల్లడం మల్లడం, ఇచ్చుకం పుచ్చుకం మొదలైన మాటల్లోని శ్రుతి సుభగత్వం అతలా కుతలం, కలగా పులగం, తల్లడిల్లడం,

ఇచ్చి పుచ్చుకోవడాల్లో వుందా? అతలా కుతలంలోని అతలాను అతులంగా మార్చుకోవడానికి వీళ్లకు ఏ వ్యాకరణ వేత్తల, పండితుల అనుమతి అవసరం లేదు. వీళ్లకు కావలసింది “కుతుల”

అనే మాటకు అనుకూలంగా “అతలా”ను “అతులం”గా మార్చుకోవడమే! తల్లడిల్లడంలోని 3+5 మాత్రల ఏర్పాటు నచ్చలేదు. వెంటనే 5+5 మాత్రల తల్లడం మల్లడంగా మార్చారు.

అట్లాగే యితర మాటలు. ఇట్లా ఉచ్చారణా విధేయంగా పదాలు, పదబంధాలు, జాతీయాలు, సామెతల్ని మార్చుకోవడంలో వెనుకంజ అన్న ప్రశ్నే లేదు వీళ్లకు. ప్రజల భాషకు పండితుల

పట్టింపులు ఉండవు. వీళ్లా పదాలను అనుకుంటె ఒక్క దగ్గరికి ముద్ద చేయగలరు. అనుకూలంగా లేకుంటే తీగలుగా సాగదీయడమే గాక రేకులుగా పర్యాప్తం చేయగలరు. మాటను

“నాదమయం” చేసే ఈ “పనితనం” సోమన, పోతన, నారన, కొరవి గోపన, కంచర్ల గోపన్న, దాశరథి, సినారె, కాళోజి, అలిశెట్టి, గద్దర్, వెంకన్న, అందెశ్రీ, దేశపతి… యిట్లా

ఎందరిలోనో కనిపిస్తుంది. తెలంగాణలో శ్వాసాలు నాదాలుగా మారడానిక్కూడా యిదే కారణం. కత్తి గట్టుడు, కన్నుగొట్టుడు, కన్ను వెట్టుడు, పనిజేసుడు, వాన్ని గొట్టుడు, వీన్ని దిట్టుడు,

ఇర్గ జూసుడు, ఇర్గవడుడు, కయ్యగోసుడు, గడ్డిదొక్కిచ్చుడు… ఇత్యాదులు.

తెలంగాణ భాషను నాదమయం చేయడంలో “పూర్ణానుసారం” పాత్ర కూడా చాలా గొప్పది చూడండి:

ఇచ్చంత్రం (విచిత్రం), నాగుంబాము (నాగు పాము), తాంబేలు (తాబేలు), లచ్చిందేవి (లక్ష్మీదేవి), చిమ్మంజీకటి (చిమ్మచీకటి), తెల్లందాక (తెల్లవారుదాకా, తెల్లవార్లూ), పుంటికూర

(పుల్లటి కూర), పొద్దుందాక (పొద్దుగూకేదాక), పొద్దుంజాముల (పొద్దుగూకేవేళ), చాంతాడు (చేదత్రాడు), వరంగల్ (ఒరుకల్), తెలంగాణ (తెలుగుస్థానం), డ్రంబు (డ్రమ్ము),

గాంచునూనె (గ్యాస్‌నూనె), సరింగ (సరిగా), ఎదురుంగ (ఎదురుగా), రాంగ (రాగ), పోంగ (పోగా), అనంగ అనంగ (అనగా అనగా), యాసంగి (వేసవి) మొ||నవి. ఇట్లాగే

తెలంగాణ మాటను లయబద్దం చేయడానికి కొన్ని అక్షరాలను ద్విత్వం చేస్తున్నారు. చిత్తగించండి.

మస్సి (మసి), మస్సాల (మసాల), గస్సాలు (గసగసాలు), అనగల్ల మాట (అనగల మాట), దయగల్ల తల్లి (దయగల తల్లి), ఆత్మగల్ల చెయ్యి (ఆత్మగల చేయి), గాలి బొయ్య బొయ్య

ఇసురుడు (గాలి బొయ్యిమని వీచడం), కాల్లు తట్ట తట్ట కొట్టుడు (కాళ్ళు తట తట కొట్టడం), గొర్ర గొర్ర గుంజుకపోవుడు (గొర గొరా లాక్కుపోవడం), పొల్ల కిస్స కిస్స నవ్వింది (కిస్సున

నవ్వడం), లప్ప లప్ప తినుడు, గుట్ట గుట్ట తాగుడు, పల్ల పల్ల ఏడ్సుడు, మిట్ట మిట్ట చూసుడు, బర్ర బర్ర గోకుడు, లట్ట లట్ట తాగుడు, పస్స పస్స తినుడు, పిస్స పిస్స మాట్లాడుడు,

తుప్ప తుప్ప ఊంచుడు మొ||నవి. ఇంతే కాదు పదంలో అసంయుక్తాక్షరాలను సంయుక్తాలుగా మార్చి నాదమయం చేస్తారు. దీన్నీ గమనించండి.

సూత్కం (సూతకం), జాత్కం (జాతకం), పాత్కం (పాతకం), నీట్కం (నీటుకం), కైలాట్కం (కైలాటకం) మొ||నవి. జంజాట్కం, పూట్కం, దోష్కం, కమస్కం (కమ్‌సేకమ్),

తీర్పాటం, తెగారం, జాగారం లాంటివన్నీ యిలా మారి ఊపిరి పోసుకున్న పదాలే! మాటలో సరిసమానమైన ‘తూగు’ను పాటించడంలో కూడా ఈ నాదాన్ని విడిచి పెట్టకూడదన్న రహస్యం

దాగివుంది. “కాండ్రించి ఉమ్మాడు” అన్న వాక్యంలోని “కాండ్రించి”ని తెలుగులో “కాండ్రకిచ్చ” అంటున్నారు. కాండ్రించి లో ఐదు మాత్రలుంటే “కాండ్రకిచ్చ”లో 3+3=6 మాత్రలు ఏర్పడి

“తూగు” సమానమైంది. “ఎండి పోవుడు” అనే మాట తెలంగాణలో “ఎండుకపోవుడు”గా వుంది. 3+4 మాత్రలుగా వున్న మాట తెలంగాణకొచ్చేసరికి 4+4గా మారింది. తెలంగాణ

పదాలకూ, పదబంధాలకూ, సామెతలకూ, పొడుపులకూ ఈ “లయ” ప్రాణం. పిల్ల పుట్టక ముందే కుల్ల గుట్టినట్టు ; తీరు తీరు చీరెలు గట్టుకొని తీర్తానికి పోతె, ఊరుకొక్క చీరె

ఊశిపోయిందట ; పంట గంజి పాసు పాసు, కైకిలి గంజి కమ్మకమ్మ ; నాబికాడ సల్లవడితె నవాబ్ తోని జవాబ్ చెప్పొచ్చు… యివన్నీ నాదమయమైన సామెతలు. ఏతావాతా చెప్పేదేమంటే

తెలంగాణ మాటకు వాదం అద్దితే పాట – సంగీతం రుద్దితే పాట – లయను దిద్దితే పాట – అసలు తెలంగాణమే తెలుగు గానం.

తెలంగాణ భాష అందమైన భాష. చిన్న పిల్లల ముక్కులోంచి చీమిడి కారుతున్నప్పుడు “ముక్కు వచ్చింది, తియ్యండి” అంటారు. “కళ్ళ కలక” ను “కండ్లు వచ్చినయనీ”, గవదబిళ్లల

వ్యాధిని “కుత్కెలు వచ్చినయనీ” లేదా “చెంపలొచ్చినయనీ” వ్యవహరిస్తారు. చేతి, కాలి వేళ్లకు అరుదుగా వచ్చే “జెట్టరోగం” పేరు ఉచ్చరించడానికే భయపడుతారు. మల విసర్జనకు వెళ్లిన

వ్యక్తిని వాడు “సుట్టాల మార్గం బోయిండు” అంటారు. అందమైన నవ్వును “శిల్క నవ్వు”గా పేర్కొంటున్నారు. సౌందర్యాన్ని “సక్కదనం, రామసక్కదనం”, పదాలతో మాట్లాడుతారు. అలికి

పూతలు పెట్టే ఎర్రమన్నును “పుట్ట బంగారం” అంటారు. తెలంగాణ భాష ఆత్మీయమైన భాష. “అన్నా ఎటు వోతున్నవే?” “ఓ అవ్వా! మంచిగున్నవా?”, “తమ్మీ! జెర పైలం”,

“తాతా! ఏం పరాశికాలే?”, “మర్దలు పిల్లా! ఈ నడ్మల జెర్ర నిగనిగ అయినవ్”, “నాయనా ! నా మొర ఏ దేవునికి ముడుతదో!”, “చెల్లే! బావ బతుకమ్మ పండుక్కు పంపలేదానే?”…

ఇట్లాంటి ఆప్యాయమైన వాక్యాలు, వావివరసలు, సహజాతి సహజాలు. తెలంగాణ భాష గ్రాంధికానికీ, కావ్యభాషకీ చాలా దగ్గరైన భాష. భాషావేత్తలకూ, వ్యాసకర్తలకూ, నిఘంటుకారులకూ

వలసినంత సమాచారాన్ని యివ్వగల్గిన అక్షయపాత్ర తెలంగాణ ప్రాంతం. ఏది ఏమయినా ఒక్కటి మాత్రం నిజం. ఇవాళ తెలంగాణ భాష లేని తెలుగు సరస్వతిని ఊహించడమే కష్టం. అట్లాంటి

చదువుల తల్లి చిత్రపటం వుంటే గింటే అది అసమగ్రమే !

linguistic analysis on Telangana dialect Reviewed by on . It is written by a unknown linguist.But,it is a marvel about the Telangana dialect.It is a fitting answer , who ridicule this dialect. enjoy the reading. తెలంగా It is written by a unknown linguist.But,it is a marvel about the Telangana dialect.It is a fitting answer , who ridicule this dialect. enjoy the reading. తెలంగా Rating: 0
scroll to top
Skip to toolbar